నిత్య స్మరణీయుడు జాషువా

0
133

రాజు మరణించెనొక తార రాలిపోయే
కవియు మరణించెనొక తార గగనమెక్కె
రాజు జీవించె రాతి విగ్రహముందు
సుకవి జీవించే ప్రజల నాలుకలయందు..
అని సర్వకాలాలందు ప్రజల నాలుకల మీద నడయాడు అక్షరాలో కవి చిరంజీవిగా ప్రకాశిస్తాడని చెప్పి తేజోమూర్తిగా కీర్తి గడించిన అపురూప కవీంద్రుడు గుఱ్ఱంజాషువా. జాతి, కులమత, వర్గ విబేధాలతో అట్టుడుకుతున్న సమాజంపై అక్షరమనే ఆయుధంతో ప్రళయార్జన చేసిన నవయుగ కవి చక్రవర్తి జాషువా తెలుగు సాహిత్యాన్ని నూతన మార్గంలోకి తీసుకెళ్లి సనాతన సాంప్రదాయ ముసుగు బ్రద్దలు కొట్టటానికి ఆధ్యుడు అయ్యాడు. 

గుంటూరు జిల్లా వినుకొండలో శ్రీ గుఱ్ఱం వీరయ్య, శ్రీమతి లింగమాంబ దంపతులకు 1895 సెప్టెంబర్‌ 28న జాషువా జన్మించాడు. కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి క్ష్మీనర్సింహారావు, తిరుపతి వేంకటకవుల ప్రోత్సాహంతో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పని చేస్తూనే అద్భుతమైన రచనలలో, ఆంధ్ర సాహిత్యానికి కలికితురాయి అయిన కవి జాషువా. గబ్బిలం, పిరదౌసి, స్వయంవరం, క్రీస్తు చరిత, ముసాఫరులు, నా కథ, నాగార్జున సాగర్‌, బాపూజీ, స్వప్నకథ, ముంతాజ్‌మహల్‌, కాందశీకుడు, గిజిగాడు, నేతాజీ, కొత్తలోకం మొదగు రచనలతో తన కలం, కరవాలం పదునును దర్శింపచేశారు జాషువా.
‘‘అక్షయంబైన మాతృక్షీర మధుధారలన్నంఋలుగా
తెచ్చుకున్న యతిథీ’’
` పాపాయి.
అప్పుడే పుట్టిన బిడ్డ ఈ లోకంలోకి వచ్చేటప్పుడు తనతో పాటుగా ఏమి తెచ్చుకుండో తెలుపుతూ ఒక రమణీయ దృశ్య కావ్యాన్ని మన కళ్లముందు సాక్షాత్కరింపచేస్తాడు. తల్లీబిడ్డ అనుబంధం గురించి చెబుతూ ఇంకో ప్రపంచాన్ని సృష్టించిన కవి చక్రవర్తి జాషువా.
‘అమృతమ్ము విషమను వ్యత్యాస మెరుగ కాస్వాదింప
చను వెర్రి బాగులాడు’
అంటూ బాల్యం ఎంత నిష్కల్మషమైనదో, నిర్మలత్వమైనదో, పవిత్రమైనదో తాను హృదయమందు అనుభవించి అక్షరరూపం ఇచ్చి మనల్నిసమ్మోహితులను చేసిన కవి జాషువా. వివాహము పేరిట, పండుగల పేరిట, కర్మకాండల పేరిట ఆర్భాటంగా వేలకు వేలు ఖర్చు పెట్టే సమాజాన్ని జాషువా తీవ్రంగా నిరసించారు.
ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించుగాని దు:
ఖితమతులైన పేద ఫకీరుల శూన్యములైన పాత్రన్‌
మెతుకు విదల్ప దీ భారత మేదిని ముప్పది మూడు కోట్ల దే
వతలెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులారునే.
– గబ్బిలం
లక్షలాది ధనంతో దేవుని పెళ్లిళ్లు చేసే ఈ భూమిలో పేద, బీద వారి కడుపు నింపడానికి ఒక మెతుకు కూడా విద్చని కఠినాత్ములపై తీవ్రంగా విరుచకపడ్డాడు జాషువా. అన్నార్దుల, పీడితుల వేదనను శివునికి చేరవేయడానికి ‘గబ్బిలం’ ద్వారా సందేశం పంపుతూ…
ఆలయంబున నీవు వ్రేలాడువేళ
శివుని చెవి నీకు కొంత చెరువుగనుండు
మౌని ఖగరాజ్ఞి పూజారి లేని వేళ
విన్నవింపుము నాదు జీవిత చరిత్ర
-గబ్బిలం
పూజారి లేని సమయంలో పరమేశ్వరుని చెవిలో లోకంలో జరుగుతున్న దౌష్ట్యాలు, అక్రమాలు, ప్రజలు పడుతున్న అగచాట్లు గురించి చెప్పాలని ‘గబ్బిలాన్ని’ కోరుతున్నసందర్భం ఆనాటి సామాజిక పరిస్థితులు మనకు దృశ్య రూపంలో కనబడతాయి. ‘గబ్బిలాన్ని’ పక్షిరాజు అనటంలోనే జాషువా ప్రాచీన సాహిత్యపు వాసనను ఎంతగా నిరసించాడో అవగతమవుతుంది.
కులమతాలు గీచుకొన్న గీతజొచ్చి
పంజరాన గట్టు వడను నేను
నిఖిల లోకమెట్లు నిర్ణయించిన, నాకు
తరుగులేదు, విశ్వనరుడు నేను
(గబ్బిలం)
కుల, మత దురహంకారాలపై కులాంతర, మతాంతర వివాహాలపై 18వ దశకంలోనే స్పష్టమైన దృక్పథాన్ని కలిగి మలువైన రచనలు చేసి తాను ఆచరించి చూపిన సామాజిక వేత్త జాషువా.జాతీయోద్యమ కాలంలో అప్పటి కవులు పురాణ, ఇతిహాసాలలోని వ్యక్తులను,సంఘటనలు ఆధారంగా రచనలు చేస్తే జాషువా సమాజంలోని అంటరానితనం, వర్గ పోరాటాలను ఆధారం చేసుకుని అరుంధతీ పుత్రున్ని, కష్టజీవులను నాయకులుగా చేసుకుని కావ్యాలను రచించారు. మనోహరంగా, గుండె లోతును కదిలిస్తూ వేదాంత భావాలతో కూడిన ధిక్కారస్వరాన్ని వినిపించే సముద్ర తరంగం జాషువా కవిత్వం. తనను తాను ఏ జాడ్యం, ఏ వికారం, అంటని విశ్వనరుడిగా ప్రకటించుకున్నఈ మహాకవి సాహిత్య రంగంలో చేయని ప్రయోగం లేదు. అన్ని ప్రక్రియలలో సాధికారత ఉన్న జాషువా ఏ కవీ స్పృశించని వస్తువును కావ్యాలుగా, పద్యాలుగా మలిచారు. ఆయన కవిత్వంలో కేవలం అన్యాయాన్ని ప్రతిఘటించాలనే భావనే కాని ఎవరి మీద కసి, కోపం, ద్వేషం కనిపించదు. సున్నిత హృదయుడైన కవి కాబట్టే తాను ఎన్ని అవమానాలు పొందినా తెలుగు సాహిత్యపు ఔన్నత్యాన్ని, దేశ సార్వభౌమత్యానికి భంగం కలిగించలేదు. 

‘ఎన్నో ఏండ్లు గతించి పోయెనని గాని ఈ శ్మశాన స్థలిన్‌’ అంటూ కాటికాపరి జీవితాన్ని అతని హృదయ కుహరాలలో తీవ్రంగా చెలరేగే భావ పరంపరను బహిర్గత పరుస్తూ జాషువా ‘హరిశ్చంద్ర’ నాటకానికి రాసిన పద్యాలు ఆయన్ని కవి లోకంలో రారాజుగా నిలబెట్టాయి. ఇక్కడ కూడా కాటికాపరి ఒక మనిషేనని, అతని హృదయం, చేతన మహోన్నతమనీ, వేదాంత భావనల్లో అతనికి ఎవరూ సాటిరారని స్పష్టం చేశారు.  మరణం సర్వసాధారణమని, ఎవరైనా మట్టిలో కలవక తప్పనప్పుడు స్వార్దం, అహంకారం ఎందుకని ప్రశ్నించాడు. మనిషిని మనిషిగా గౌరవించినప్పుడే సమాజంలో ఆనందం తాండవిస్తుందని నిత్యం ఆశించాడు. సామాజిక అంతరాలపై నిరాఘాటంగా పోరాడి తన రచనల ద్వారా ప్రచండాగ్నిగా చెలరేగిన జాషువా తాను కలలు కన్న భారతావని దృశ్యాలను మనకు వారసత్వంగా అందించి మనకొక బృహత్తర బాధ్యతను అందించిన కవి జాషువా. శతాబ్దాల భారతీయ సాహిత్యంలో అరుదైన కవిగా జాషువాను చెప్పవచ్చు. ఆయన నిరంతరం సమాజం, ప్రజలు, అసమానతలు, దేశం, దేశ పరిస్థితులు అనే అంశాల చుట్టూనే పరిభ్రమించిన సామాజిక వేత్త, తత్త్వవేత్త, మహాకవి. అరుదైన భావాలతో, అసమాన కవితాధారతో ప్రజాసాహిత్యం సృష్టించిన పద్మభూషణుడు, నవయుగ కవితా చక్రవర్తి, మహాకవి జాషువా నిత్య స్మరణీయుడు.

అట్లూరి వెంకటరమణ,
కవి, రచయిత,
9177237945.

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here