‘శంటాలం ఆల్బం’ అనే శాస్త్రీయ నామంతో పిలిచే “శ్రీగంధం” ప్రపంచ కలప వృక్షాలలో మహోన్నత స్థానంలో ఉంది. శ్రీగంధపు చెట్టు అంతర దారువు నుండి లభించే తైలాన్ని సుగంధ ద్రవ్యంగా, అత్తరు, అగరుబత్తి, సబ్బులలోను, ఔషధంగానూ, ఇతర టాయిలెట్ సువాసనలకు ఉపయోగిస్తారు . శ్రీగంధంకు దేశ,విదేశాల్లో మంచి మార్కెట్ ఉంది . అధిక వెల, గిరాకీ ఉండటం వాళ్ళ శ్రీగంధం బంగారంగా ఖ్యాతి పొందింది .

పలు ప్రయోజనాలున్న శ్రీగంధం కొన్నేళ్ళ క్రిందటి వరకు అటవిశాఖ ఆధీనంలో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమతం అయింది. అయితే అటవిశాఖ సరైన యాజమాన్య చర్యలు చేపట్టకపోవడం తక్కువ వయసు కలిగిన మొక్కలను కూడా అధికంగా నరికి వేయడం వల్ల నేడు శ్రీగంధం “అంతరించి పోతున్న అరుదైన మొక్క”గా గుర్తింపు పొందినది. అందువల్ల భారత ప్రభుత్వం ఈ శ్రీగంధం చెట్టును రైతు వారి పద్దతిలో సాగు చేయుటకు అనుమతించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఔషధ బోర్డు నుండి రూ.21,000 రాయితీని కూడా ప్రోత్సాహం కింద అందిస్తున్నది .

సాగు పద్దతులు :

మంచి నాణ్యమైన తైలం, కలపలో అధిక దిగుబడి సాధించాలంటే మేలైన యాజమాన్య పద్దతులు పాటించాలి .

నేలలు, వాతావరణం :

శ్రీగంధం చెట్లను నల్లరేగడి నేలల్లో తప్ప అన్ని నేలల్లో పెంచవచ్చు. చెట్లు వేగంగా పెరగాలంటే రాతి గరప , నీరు నిలవని బండ్రు నేలలు , ఇసుక నేలలు అనువైనవి . విలువైన అంతర దారువు ఏర్పాటుకు పొడి వాతావరణం అనుకూలం.

నేల తయారీ విధానం :

నేలను రెండు లేదా మూడు సార్లు దున్ని చదును చేయాలి. నేల స్వభావాన్ని బట్టి చెట్ల మధ్య దూరం (5-10 అడుగులు) నిర్ణయించాలి.

నాటే విధానం :

ఒక అడుగు పొడవు, లోతు, వెడల్పు గల గుంతలు త్రవ్వి, వాటిలో రెండు కిలోల పశువుల ఎరువు వేసి, దానిలో  రెండు నెలల వయస్సు, 7-8 ఆకులు కలిగిన శ్రీగంధం మొక్కలు నాటుకోవాలి . శ్రీగంధంతో పాటు 5 అడుగుల దూరంలో ప్రధాన అతిధేయి మొక్కగా మలబారు వేప, ఆపిల్ రేగు, జామ వంటి మొక్కలను నాటుకోవాలి .

నీటి యాజమాన్యం :

మొదటి ఆరు నెలల్లో వారానికో తడినివ్వాలి. ఆ తరువాత ప్రతి 20 -30 రోజులకో తడినివ్వాలి. నీటిని డ్రిప్ పద్దతిలో అందిస్తే మొక్క వేగంగా,  ఏపుగ  పెరిగి  అధిక దిగుబడిని ఇస్తుంది .

పోషక యాజమాన్యం :

శ్రీగంధం పోషకాలను భూమి నుండి తీసుకోలేదు. కాని ప్రత్యేకమైన వేర్లు సహాయంతో ప్రధాన అతిధేయి వేర్లతో సంబంధాన్ని ఏర్పరుచుకుని కావాల్సిన పోషకాలను తీసుకుంటుంది. కాబట్టి సంవత్సరంలో రెండు సార్లు ప్రధాన అతిధేయికి నత్రజని 200 గ్రా, భాస్వరం 250 గ్రా, పోటాష్ 250 గ్రా చొప్పున అందించాలి .

దిగుబడి :

శ్రీగంధం మొక్క నాటిన మూడో ఏట నుండి తైలాన్ని ఇచ్చే అంతర దారువు ఏర్పడటం ప్రారంభం అవుతుంది. నేల స్వభావం , యాజమాన్య చెర్యలను బట్టి 10-12 ఏళ్ళ వయస్సు కలిగిన  మొక్క 60 -100 సెం.మీ కైవారంతో , 15-20 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది . ఈ 10-12 ఏళ్ళ వయస్సు కలిగిన మొక్కను నరికితే 25-50 కిలోల అంతర దారువు లభిస్తుంది. ప్రస్తుతం కిలో శ్రీగంధం ధర రూ.16000 వరకు ఉన్నది. అంటే ఒక చెట్టు నుండి రూ.4-8 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇటీవల వాణిజ్య సరళిలో ఒక వంద గజాల స్థలంలో 10-15 మొక్కలు నాటి 10-12 సంవత్సరాలు పెంచే పద్ధతి లో మొక్కలు సాగు చేస్తున్నారు. ఈ విధానంలో రూ.40-80 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. బంగారం వాలే ప్రతిరోజు దీని ధర పెరగడం వల్ల 10-12 సంవత్సరాలలో దీని ధర ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది .

 –  డా.ఐ.వి.శ్రీనివాస రెడ్డి , అసోసియేట్ ప్రొఫెసర్,
ఉద్యాన విభాగం ,వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట .

                                                                          

 

        

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here