2022 కల్లా కృత్రిమ చందమామలు తయారు చేస్తామంటున్న చైనా

0
108

ఆకాశంలో చైనా వారి కృత్రిమ చందమామలు

ఆకాశంలో ఉండే చందమామతో అనుబంధం ప్రతి ఒక్కరికి చిన్ననాటి నుండే ఏర్పడుతుంది. పిల్లల కడుపు నిండితే చాలు తన కడుపు నిండి పోయినట్లే అని ప్రతి తల్లి హృదయం ఆరాటపడుతుంది. దానికోసం ఆ తల్లి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆకాశంలో చందమామను చూపిస్తూ చందమామ రావే… జాబిల్లి రావే… కొండెక్కి రావే… కోటి పూలు తేవే… అంటూ తన పిల్లలను ఆడిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ, ఆ తల్లి ఎంతో ఆనంద పడుతుంది. అలాగే పండు వెన్నెల్లో ప్రేమ రాగాలు పాడుకునే ప్రేమికులు ఎందరో. సమస్త చరాచర జీవులన్నీ కూడా పండు వెన్నెల వేళ ఆనంద విహారం చేస్తుంటాయి. 

సృష్టికి ప్రతిసృష్టి సృష్టించే విధంగా అభివృద్ధి పరుచుకున్న మేధస్సుతో మానవుడు ఏనాడో చంద్రమండలంపై కాలు మోపాడు. అంతేనా… ఏకంగా అంతరిక్షంలో విహారించడమే  కాకుండా అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకొనే విధంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతరిక్షంలోనే వ్యవసాయం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. 

ఇక విషయానికొస్తే… మామ కాని మామ అయిన  చందమామ ను అందుకోవడం సంగతి అలా ఉంచితే, మన పొరుగు దేశమైన చైనా ఇప్పుడు ఏకంగా చందమామలనే తయారుచేసి అంతరిక్షంలోకి పంపుతుంది అట. ఇది కాస్త విచిత్రంగానే అనిపిస్తున్నా… చైనా ఆలోచన వెనుక చాలా పెద్ద ప్రణాళిక దాగుంది అనేది తెలుసుకోవాల్సిన విషయం. భూమికి సుమారు 3,84,400 కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలో ఉన్న చందమామ రాత్రి వేళల్లో కాంతిని వెదజల్లుతుంది. సూర్యుడి కాంతి చందమామ యొక్క ఉపరితలం పై పడి పరావర్తనం చెందడం వలన ఏర్పడే కాంతి(వెలుగు) భూమిపై పడుతుంది. సూర్యుడి నుండి వెలువడే కాంతి లో కేవలం 3 నుండి 12 శాతం మాత్రమే చందమామ నుండి పరావర్తనం చెంది వెలుగులా భూమిపై పడుతుంది. 

చైనా కూడా ఇదే ఫార్ములాతో కృత్రిమ చందమామలను తయారు చేయాలని భావిస్తోంది. అతి పెద్ద అద్దం తో తయారు చేసే మూడు కృత్రిమ చందమామలను ( కృత్రిమ చందమామ అనగా ఒక రకమైన శాటిలైట్ గా భావించవచ్చు) భూమికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి చైనా ప్రవేశపెట్టనుంది. ఈ కృత్రిమ చందమామల్లోని  అద్దాలపై పడే సూర్యకాంతి కొన్ని వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు పరావర్తనం చెందుతుందని అంచనా. 

ఈ రకమైన శాటిలైట్ల ద్వారా వచ్చే కాంతి దాదాపు 6 నుండి 50 మైళ్లు (10  కి. మీ నుండి 80 కిలోమీటర్లు) వరకు వ్యాపిస్తుంది. ఈ కృత్రిమ చందమామల  ద్వారా వచ్చే కాంతి మామూలుగా ఆకాశం నుండి వచ్చే కాంతి కి 8 రెట్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టు వలన వచ్చే కాంతిని చైనా లోని ఒక ప్రసిద్ధ నగరమైన చెంగ్ధూ  లో వినియోగించనున్నారు. ఈ కాంతి ని ఉపయోగించి ఈ పట్టణంలోని వీధి దీపాలను వెలిగించ నున్నారు. దీని వలన ఈ పట్టణంలోని ప్రతి చదరపు కిలోమీటర్ వరకు కాంతిని వినియోగించడం వలన ఒక సంవత్సరానికి అయ్యే  కరెంట్ బిల్లు 1.2 బిలియన్ యువాన్ లు (170 మిలియన్ డాలర్లు) ఆదా చేసే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈ కృత్రిమ చందమామలకు సంబంధించిన వివరాలను చైనాలోని ” తియాన్ ఫూ న్యూ ఏరియా సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్” ముఖ్య శాస్త్రవేత్త అయిన ” ఊ చున్ ఫెంగ్ “, చైనా లోని  డైలీ న్యూస్ పేపర్ ” పీపుల్స్ డైలీ ” అనే దినపత్రిక కు  తెలియజేశారు. ఈ చందమామ లను అంతరిక్షంలోకి పంపే తేదీలను మరియు ఇతర వివరాలను 2020 కల్లా తెలియచేస్తా మని అలాగే ఈ ప్రాజెక్టును 2022 కల్లా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

ఈ కృత్రిమ చందమామల వలన లాభమా? నష్టమా?

ఈ చందమామ ల వలన ఎంతో విద్యుత్ ను ఆదా చేయవచ్చునని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే సహజసిద్ధమైన కాంతి పై ఆధారపడే కొన్ని రకాల మొక్కలు, జంతువులకు ఇలాంటి కృత్రిమ కాంతి వలన హాని జరిగే అవకాశం ఉందని కొందరు వాదిస్తున్నారు. కొన్ని రకాల జంతువులు ముఖ్యంగా కొన్ని రకాల తాబేళ్లు కొన్ని ప్రదేశాలలో నిండు చందమామ ఏర్పడే ముందు రోజు వాటి సంతానోత్పత్తి కోసం అండం విడుదల చేస్తుంటాయి. అలాంటి జీవులకు ఇలాంటి కృత్రిమ కాంతి వలన నష్టం జరగవచ్చు. ఎక్కువ కాంతి వలన మానవులకు కూడా నిద్రా సంబంధ విషయాలలో సమస్యలు రావచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి కృత్రిమ కాంతి ప్రయత్నాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. 1920లో “హెర్మన్ ఒబెర్త్” అనే జర్మన్ భౌతిక శాస్త్రవేత్త అంతరిక్షంలోకి అద్దం లాంటి దాన్ని ఉపయోగించి కాంతిని భూమి మీదకు పంపే పద్ధతిని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయోగం ఎలాంటి ఫలితం ఇవ్వలేదు. మరలా ఏడు దశాబ్దాల తర్వాత అనగా 1993 ఫిబ్రవరి 4న రష్యా వ్యోమగాములు ఒక చిన్న ప్రయోగాత్మక అద్దం ను ” మిర్ అంతరిక్ష కేంద్రం” నుండి రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు రష్యా పెట్టిన పేరు ” జ్యామ్న  లేదా బ్యానర్”. కానీ ఇది కూడా సరైన ఫలితాలు ఇచ్చినట్లు ఆధారాలు లేవు.

సంకలనం : సురేష్ బోయనపల్లి

గమనిక: పల్లెప్రపంచం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here